November 15, 2024

కమనీయం… శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవం

చెన్నై న్యూస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం, కుచలాంబాల్ చారిటీస్- చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి 4 వ తేదీ ఆదివారం వైభవంగా జరిగింది. లోకకళ్యాణార్థం ఈ కల్యాణాన్ని చెన్నైలోని చెట్ పేటలో ఉన్న కుచలాంబాల్ కళ్యాణ మండపం వేదికగా నిర్వహించారు.ఈ కళ్యాణోత్సవ వేడుకను శ్రీశైలం దేవస్థానం ప్రధాన అర్చకులు ఎం .శివశంకరయ్య , అమ్మవారి ఆలయం ఉప ప్రధాన అర్చకులు ఎం .సత్యనారాయణ శర్మల నేతృత్వంలో వేదమంత్రోచ్ఛరణ నడుమ కమణీయంగా కల్యాణ క్రతువు సాగింది.

మామిడి తోరణాలు, పూలతో అలంకరించిన వేదికపై శ్రీ భ్రమరాంబా దేవి, మల్లికార్జున స్వామి వార్ల కల్యాణ మూర్తుల విగ్రహాలను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు.మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణలు మధ్య మాంగల్యధారణ చేశారు.ఈ కళ్యానోత్సవ వైభవంలో కుచలాంబాల్ చారిటీస్ అధ్యక్షుడు కె .సుబ్రమణ్య మోహన్, ఆయన కుమారుడు కార్తీక్, కుటుంబ సభ్యులు,మేనేజర్ రమేష్ , టిటిడి స్థానిక సలహా మండలి – చెన్నై సలహామండలి ఉపాధ్యక్షులు కె.ఆనంద కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు పి వి ఆర్ కృష్ణారావు, బి .మోహన్ రావు ,డి. రాధాకృష్ణ మూర్తి, కె.రంగారెడ్డి, సుధాకర్ రెడ్డి అలాగే
వివేకానంద కేంద్ర ( కన్యాకుమారి) కి చెందిన వి .బాలకృష్ణన్, తెలుగు ప్రముఖులు గోటేటి వెంకటేశ్వరరావు , ఏ. రమేష్, శ్రీశైలం ఆలయ ఇంచార్జి డి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.ముందుగా అర్చకులు గణపతి పూజ, ,మహాసంకల్పంతో పాటుమాంగల్య ధారణ, వేద ఆశీర్వచనాలతో స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కనుల పండుగ చేశారు. నగరంతో పాటు నగర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కళ్యాణ వేడుకలు భక్తులను భక్తి పారవశ్యంలో నింపింది. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలతో పాటు శ్రీశైలం దేవస్థానం నుంచి ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన ప్రసాదాలను అందజేశారు. ఇంకా కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం వేద పండితులు వి. జగన్నాధ శర్మ, సిహెచ్ జ్యోతి స్వరూప్, ఆలయ సిబ్బంది, ప్రచారకులు పాల్గొన్నారు.
..

About Author