January 17, 2025

ఘనంగా శ్రీ వేణుగోపాల్ విద్యాలయ 43వ వార్షికోత్సవం

కొరుక్కుపేట:చెన్నై మందవేల్లిలో తెలుగు మహాజన సమాజం నిర్వహిస్తున్న శ్రీ వేణు గోపాల్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ 43వ వార్షికోత్సవం అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై తేనంపేట లోని కామరాజర్ ఆరంగం వేదికైంది. అతిధులు, నిర్వాహకులు సమక్షంలో జ్యోతి ప్రజ్వలన ,మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్ధనాగీతంలో ప్రారంభమైన ఈ వేడుకలు సుమారు మూడు గంటల పాటు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అతిధుల ప్రసంగాలతో అలరించాయి.ముందుగా తెలుగుమహాజన సమాజం,పాఠశాల మాజీ అధ్యక్షులు ఈ ఎస్ రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.పాఠశాల అధ్యక్షుడు కే అనిల్ కుమార్ రెడ్డి స్వాగతం పలుకుతూ పాఠశాల ఎదుగుదల,విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు,ఉపాధ్యాయుల సేవలు గురించి వివరించారు. విద్యార్థులను విద్యాతో పాటు ఎక్స్ ట్రా కరికులంలోనూ ప్రొత్సహిస్తున్నామన్నారు.ప్రతీ ఏడాది తమ పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధిస్తూ నగరంలో గొప్ప విద్యాలయాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.

విద్యాదానం …గొప్పదానం:ముఖ్య అతిధిగా పాల్గొన్న అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏ ఐ టీ ఎఫ్), లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరమ్ ఆఫ్ తమిళనాడు చైర్మన్ ఆచార్య డాక్టర్ సి ఎం కే రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పదానమని అన్నారు.విద్య అందిస్తే కుటుంబం బాగుపడుతుంది అంటే కాకుండా సమాజం ముందుకు వెల్లుతుందన్నారు.ప్రపంచ దేశాల్లో ఉన్న సంస్కృతి సంప్రదాయాలల్లో కంటే భారతీయ సంస్కృతి చాలా గొప్పదని కొనియాడారు.ప్రతీదానికి భయపడకుండా ఆత్మస్థైర్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని,
కమ్యూనికేషన్ స్కిల్స్ పైనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు పట్టుదలతో చదువుకోవాలని హితవు పలికారు.విద్యలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.అలాగే పాఠశాల నిర్వాహకుల సేవలను కొనియాడుతూ శాలువా కప్పి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి ,కరస్పాండెంట్ వి .గోవింద్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. పదవ తరగతి, ప్లస్ టూ ఫలితాల్లో అత్యదిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు ప్రకటించి సభికుల కరతాల ధ్వనులు మధ్య అభినందించారు.మెరిట్ విద్యార్థులకు అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా హ్యాండ్ వాచ్ లు బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాక్టింగ్ ప్రిన్సిపాల్ లు లేఖ స్టీఫెన్,ఇలంగో,పాఠశాల కోశాధికారి కే.రంగా రెడ్డి ,తెలుగు ప్రముఖులు ఆనంద కుమార్ రెడ్డి, గొల్లపల్లి ఇశ్రాయేలు, డాక్టర్ నాగభూషణం , శర్మ తదితరులు పాల్గొన్నారు

About Author