January 22, 2025

తెలుగువారికి అండగా ఉంటాం-తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అధ్యక్షులు దేవరకొండ రాజు

చెన్నై న్యూస్:తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ (టి ఎన్ టి పి ఎస్) తెలుగు ప్రజలకు అండగా నిలుస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండరాజు అన్నారు.తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ 5వ వార్షికోత్సవం, విజయోత్సవ వేడుకలు చెన్నై అశోక్ నగర్ లోని కాశీ టాకీస్ ప్రాంగణంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి.మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గీతం, తెలుగు మహిళల జ్యోతిప్రజ్వలన ,ప్రముఖుల చేతుల మీదుగా కేకే కట్టింగ్ లతో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకలకు దేవర కొండ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన సొసైటీ తరపున 5 ఏళ్లుగా సమాజానికి అందించిన సేవాకార్యక్రమాలను ముఖ్యంగా కరోనా సమయంలో చేసిన విస్తృత సేవలను సభకు వివరించారు.తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి మధ్య అందిస్తున్న సేవలను గురించి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అందుకున్న అవార్డుతో పాటు కళారంజని, ఎస్ కె పి డి వంటి సంస్థల కూడా ఉత్తమ సేవా పురస్కారాలు అందించాయని అన్నారు.దీంతో తన పై మరింత బాధ్యత పెరిగిందన్నారు..తాము ఏ సంస్థతో కూడా పోటీ పడకుండా తంవంతుగా సేవ కార్యక్రమాలతో అన్ని సంఘాలను కలుపుకుంటూ ముందుకెళుతున్నట్టు తెలిపారు. తెలుగువారికి ఎల్లప్పుడూ తమ సొసైటీ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.చెన్నైలో పలు రంగాల్లో రాణిస్తున్న తెలుగు ప్రముఖులను ఒకే వేదికపై తమ సొసైటీ ద్వారా సత్కరించుకోవటం నా పూర్వజన్మ సుకృతం అని అభిప్రాయ పడ్డారు. తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వారికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ కిల్లంపల్లి శ్రీనివాస రావు, ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షుడు జె ఎం నాయుడు, చెన్నై టిడిపి ఫోరమ్ అధ్యక్షులు డి .చంద్రశేఖర్, నటుడు కూల్ సురేష్, తెలుగు ప్రముఖులు శోభారాజా , ప్రియా శ్రీధర్ , తిరుమల శైలజా, బెల్లంకొండ శివ ప్రసాద్, సంపత్ కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు విచ్చేసి సొసైటీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా నర్తకి లక్ష్మీ శ్రేయ ప్రదర్శించిన భరత నాట్యం అలరించింది. వ్యాఖ్యాతగా దేవరకొండ రాజు సతీమణి సూర్యకుమారి వ్యవహరించారు.ఈ వేడుకల్లో తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

….

About Author