December 26, 2024

యేసు క్రీస్తు త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలి – రెవరెండ్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్

చెన్నైన్యూస్ :యేసు క్రీస్తు జీవితాన్ని,త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ( ఎం సి టి బి సి) కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్. రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శతాబ్ది కాలానికి పైగా చరిత్ర కలిగిన వెపేరి హైరోడ్డులో ఉన్న మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు సంఘంలో గుడ్ ఫ్రైడే వేడుకలు మార్చి 29వ తేదీ శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.సంఘం కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఆరాధనలో నగరం నలుమూలల నుంచి తెలుగు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గం అధ్యక్షులు గాలిమట్టి రామయ్య, కార్యదర్శి పోతల ప్రభుదాసు, కోశాధికారి అనమలగుర్తి బాబు సహా పలువురు కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తు సిలువపై పలికిన
ఏడు మాటలను సంఘకాపరి రెవరెండ్ రాజేంద్ర ప్రసాద్, రెవరెండ్ ఎం. సరోజా, రెవరెండ్ డాక్టర్ కే జే కామేశ్వర రావు, రెవరెండ్ కె.జగన్మోహన్ రావులు తమ సందేశం ద్వారా వినిపించారు. యేసు క్రీస్తు జీవితాన్ని, త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ,దేవుడికి లోబడి , ఆత్మీయ జీవితాన్ని గడపాలని సూచించారు. యువతీ యువకులు చెడుత్రోవలో నడవకుండా తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. పరలోకం అంత సులభమైనది కాదని,అయితే యేసు ప్రభువుతో సహవాసం చేస్తే చాలా సులభమని ఉపదేశించారు. బైబిల్ ను ఒక్కసారైనా పూర్తిగా చదవాలని అన్నారు. మహిళలు ప్రత్యేక క్రైస్తవ గీతాలను అలపించి అలరించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
….

About Author