December 25, 2024

సంగీత దర్శకులు సాలూరి వాసు రావు సారధ్యంలో అలరించిన సంగీత విభావరి

చెన్నై : చెన్నై రాయపేటలోని గౌడియా మఠంలో శుక్రవారం రాత్రి శ్రీ కృష్ణ జయంతి, నందోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ నందోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసూ రావు బృందం సంగీత విభావరి నిర్వహించారు.దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సంగీత విభావరితో భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లారు. గౌడియా మఠం లో ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి , నందోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. అందులో భాగంగా సెప్టెంబర్ 8 వ తేదీ శుక్రవారం రాత్రి నందోత్సవం సందర్భంగా సంగీత దర్శకులు సాలూరి వాసు రావు సారధ్యంలో సంగీత కారులు కిడాంబి లక్ష్మీకాంత్, మాధవి, పవిత్ర లు భక్తి గీతాలు ,భజన పాటలను శ్రావ్యంగా ఆలపించి ఆహూతులను వీనులవిందు చేశారు. మొట్టమొదటగా స్వాగతం కృష్ణా అనే కీర్తనను గాయకుడు కిడాంబి లక్ష్మీకాంత్ ఆలపించారు. గాయని మాధవి అచ్యుతం కేశవం కృష్ణదామోదరం అనే భజన పాటను అత్యద్భుతంగా ఆలపించారు.అలాగే మరో గాయని ప్రముఖ గాయని పవిత్ర కురయిండ్రు మిల్లై అనే తమిళ కీర్తనలను పాడి మైమరిపించారు. అలాగే ముగ్గురు గాయకులు కలసి అనేక భక్తి, భజన పాటలను రసరమ్యంగా, ఎంతోరసవత్తరంగా పాడి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా సాలూరి వాసు రావు మాట్లాడుతూ, పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు , ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు తరం నుంచి ఈ వేదిక మీద నిరంతరాయంగా సంగీత కార్యక్రమాలు జరిగేవని అన్నారు.గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రతీ సంవత్సరం నందోత్సవం రోజున సంగీత విభావరి నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ వేదికపై కచేరిలో పాడిన గాయనీ గాయకులు ఉన్నత స్థానంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు.ఈ మఠం కు 90 ఏళ్ళు చరిత్ర ఉందని ఇటువంటి పవిత్రమైన సన్నిధిలో తాను నిరంతరాయంగా సంగీత విభావరి నిర్వహిస్తుండటం తన అదృష్టం అని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులకు, గాయనీ గాయకులకు, అలాగే వాయిద్య సహకారం అందించిన ఎస్.వెంకట్ రావు (తబలా),రమేష్ (కీబోర్డు), సి.సుబ్రహ్మణ్యం (డోలక్ )లకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author