December 23, 2024

సెల్వ గణపతి దేవాలయం- శ్రీరాముల వారి సన్నిధిలో నేత్రపర్వంగా శంఖాభిషేకం

చెన్నై న్యూస్ : తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూర్ సమీపంలోని కాకలూరు మారుతి న్యూ టౌన్ లో వెలసియున్న సెల్వ గణపతి దేవాలయం- శ్రీరాముల వారి సన్నిధిలో మే 26వ తేదీ ఆదివారం శంఖాభిషేకం నేత్రప ర్వంగా నిర్వహించారు. 2023 సంవత్సరం మే నెలలో ఈ ఆలయ సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం జరిగిన సందర్భంగా సంవత్సరాభిషేకం, సంకటహర చతుర్థి విశేష పూజలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం విఘ్నేశ్వర పూజ, గోపూజ, కలశ స్థాపన, 108 శంఖాల పూజ, మూలమంత్ర హోమం, కలశాభిషేకం, శ్రీరామ శటాక్షరి హోమం, మహా పూర్ణాహుతి చెన్నై అడయార్ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు డి.సుందరం శర్మ బృందం, టీటీడీ వేదపండితులు యజ్ఞనారాయణ గనపాటి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు ఊరా శ్రీమన్నారాయణ, సరళ దంపతులు ఏర్పాట్లు పర్యవేక్షించి ముత్తయిదువులకు పసుపు కుంకుమలు, భక్తులకు అన్నతీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తుల జై శ్రీరామ్, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా ఊరా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ లోకకల్యాణం కోసం శంఖాభిషేకం పూజలను నిర్వహించామని తెలిపారు. విఘ్నేశ్వరుడు, శ్రీరాముని అనుగ్రహంతో ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో , అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

About Author