December 23, 2024

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస తిరు కళ్యాణ మహోత్సవం

చెన్నై న్యూస్:గోవింద….గోవిందా..ఏడుకొండల వాడా వెంకటరమణ.. గోవింద …గోవిందా అంటూ శ్రీవారి గోవింద నామస్మరణలతో మాధవరం ప్రాంతం మారుమ్రోగింది. ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, త్రిదండి అహోబిల రామనుజ జీయర్ స్వాముల మంగళా శాసనాలతో శ్రీ వెంకటాద్రి భజన సమాజం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస తిరు కళ్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మాధవరం పొన్నియమ్మన్ మేడు, జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులోఉన్న ఉమియ మహల్ వేదికగా ఉదయం 7.45 గంటలకు మహా తిరుమంజనం, అభిషేకం, కాశీయాత్ర, మాలల మార్పిడి, ఊంజల్ సేవ, మహాసంకల్పం, హోమం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలలోపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస తిరుకళ్యాణాన్ని జరిపించారు. జీయర్ స్వాముల పర్యవేక్షణలో మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణలు, భక్తుల గోవింద నామ స్మరణల మధ్య అంగరంగవైభోగంగా మంగళ్యధారణ చేశారు. శ్రీమాన్ భక్త పార్థసారథి రామానుజర్ ఆశీస్సులతో లోకసంక్షేమార్థం శనివారం సాయంత్రం ఏడు గంటలకు గరుడసేవ, శ్రీజన్మరక్షక హరినామ సంకీర్తనం, భక్తిగీతాల ఆలాపనలు భక్తిభావాన్ని నింపాయి. శ్రీ వెంకటాద్రి భజన సమాజం నిర్వాహకులు K .పద్మరాజ్, K. ఐశ్వర్య తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులందరికీ అన్న, తీర్థ ప్రసాదాలు, ముత్తయిదువులకు పసుపుకుంకములు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమానికి శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టి. మోహనశ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణలు చేసి ఆశీర్వదించారు.శ్రీ వెంకటాద్రి భజన సమాజం చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను కొనియాడి మరింతగా దైవ సేవను చేయాలని దీవించారు.అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో TTD స్థానిక సలహా మండలి-చెన్నై సభ్యులు, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ – చెన్నై కార్యవర్గ సభ్యులతో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చి శ్రీవారి కృపకు పాత్రులయ్యారు

About Author