November 13, 2024

అమరజీవి జీవితం భావితరాలకు ఆదర్శం…ఆచార్య సీఎంకే రెడ్డి వ్యాఖ్య.

చెన్నై న్యూస్ :అమరజీవి పొట్టిశ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏ ఐ టీ ఎఫ్) అధ్యక్షులు ఆచార్య సీఎంకే రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు 123వ జయంతి వేడుకలను మార్చి 16వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించారు.గాయని వసుంధర దేవి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ సభలో కమిటీ సభ్యులు డాక్టర్ ఎం వి నారాయణ గుప్తా స్వాగతం పలికారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షులు కాకుటూరి అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రపంచంలో ఎంతో మంది త్యాగాలు చేశారని వారిలో ఎవ్వరికీ దక్కని అరుదైన “అమరజీవి”అన్న బిరుదు తెలుగు తల్లి ముద్దుబిడ్డ పొట్టిశ్రీరాములుకు దక్కిందని కీర్తించారు. దేశభక్తితో జీవించిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతి గురించి భావితరాలకు తెలియజేయాలన్న దృక్పథంతో తమ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జయంతి , వర్ధంతి వేడుకలు చేపడుతున్నట్టు చెప్పారు. విద్యార్థులకు అమరజీవి జీవిత చరిత్ర గురించి అవగాహన కల్పించేలా” పొట్టిశ్రీరాములు లో మీకు నచ్చిన అంశాలు ఏమిటీ” అనే అంశంపై వక్తృత్వ , వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయగా ఇందులో నగరంలోని ఎస్ కె పి డి , కె టి సీ టి, టి.నగర్ కేసరి, ఎస్ కె డి టి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని చక్కని ప్రతిభను చూపారని అభినందించారు.

అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం కె రెడ్డి విజేతలకు ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగు సభల్లో నిండుదనం ఉంటేనే పాలకుల్లో ఆంధ్రుల పట్ల స్పందన కలుగుతుందని, తెలుగు వారంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలుగు భాషను కాపాడుకోవడంలో తల్లిదండ్రులు ముందుండి తమ పిల్లలను మాతృభాషలో చదివించాలని , భాష లేకుంటే జాతి లేదని సీఎంకే రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం విశిష్ట అతిధి ప్రముఖ సినీ గేయారచయిత భువనచంద్ర మాట్లాడుతూ అమరజీవి ప్రాణ త్యాగం వల్లనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బీహార్ తదితర రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య కార్యక్రమ నిర్వహణ చేస్తూ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి సేవా గుణంతో విద్యార్థులను ప్రోత్సహించడం ,గత మూడు సంవత్సరాలుగా అమరజీవి స్మారక భవన నిర్వహణను చక్కగా చేపట్టడం ముదావహం అని సభలో కొనియాడారు.

ఆత్మీయ అతిథిగా టి.నగర్ కేసరి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య,ఎస్ కే పి డి బాలుర మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓరుగంటి లీలారాణి , కె టి సి టి పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు రేవతి బాల ,రచయిత్రి ఆముక్తమాల్యద , మోహన్ , రచయిత ప్రణవి తదితరులు పాల్గొన్నారు.వేడుకల ఏర్పాట్లను కమిటీ సంయుక్త కార్యదర్శి వూరా శశికళ, సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య ,జె ఎం నాయుడు తదితరులు పర్యవేక్షించారు.
ఊరా శశికళ వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.ముందుగా భవనంలోని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో ప్రతిభను చాటుకున్న ఒక విద్యార్థికి కమిటీ సభ్యులు జె ఎం నాయుడు గారు నగదు బహుమతి అందించి అభినందించారు.ఇంకా ఈ వేడుకల్లో వై.పట్టాభి రామయ్య, శర్మ, పాల్ కొండయ్య, ఎస్.సతీష్, ఏ.బలభద్ర, పల్లిపాటి సతీష్ ,వీర పాండ్య కట్ట బొమ్మన్ వంశీయులు ఇలాయ కట్టబొమ్మన్ తదితరులు పాల్గొన్నారు.

About Author