December 23, 2024

ఆంధ్రా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని నిరసిస్తూ సేవాదళ్ తమిళనాడు శాంతియుత నిరసన

చెన్నై న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విజయవాడలో
జరిగిన దాడిని ఖండిస్తూ చెన్నైలో సోమవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. వళ్లువర్ కోట్టం వేదికగా వై ఎస్ ఆర్ సి పి సేవా దళ్ తమిళనాడు విభాగం అధ్యక్షులు జహీర్ హుస్సేన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనకు పెద్ద ఎత్తున మహిళలు, యువత, విద్యార్థులు, అభిమానులు తరలివచ్చారు. జగనన్నకు తాము అండగా ఉన్నామని ప్లకార్డులను చేతపట్టి జై జగన్ ..జై జగన్ అంటూ నినదించారు. దాడులను ప్రేరేపించే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిన తక్షణమే తీవ్రంగా ఖండించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సేవాదళ్ తరపున జహీర్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి నేతలు కే శరవణన్, శరత్ కుమార్ రెడ్డి, సేవాదళ్ మహిళా నేత కృతిక, ట్రిప్లికేన్ వై ఎస్ ఆర్ సేవాదళ్ కె.కృష్ణా రెడ్డి, కొరుక్కుపేట సురేష్, శివ, సంపత్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author