January 21, 2025

ఎస్ కె పి సి లో అలరించిన అనుపమాన సంగీత గేయధార

చెన్నై న్యూస్: ఓ వైపు సంగీత గేయధార …మరో వైపు తెలుగు భాష సాహిత్యాలకు ఎనలేని సేవలు చేస్తున్న భాష సేవకులకు పురస్కారాలతో సత్కారం….ఇంకో వైపు అతిధుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు వెరసి ఈ కార్యక్రమాలు ఆసాంతం విద్యార్థిని విద్యార్థులను అమితంగా ఆకట్టుకున్నాయి.

     అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరీ మహిళా కళాశాల (ఎస్ కె పి సి) ఐక్యూఏసి, సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సంగీత సాహితీచంద్ర సాయికృష్ణ యాచేంద్ర చే అనుపమాన సంగీత గేయధార కార్యక్రమం ,

భాష అభిలాష సన్మాన సంబరాలను ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. చెన్నైజార్జి టౌన్ లోని ఎస్. కె. పి. కన్వెన్షన్ సెంటర్ వేదికగా ముందుగా సాయికృష్ణ యాచేంద్ర 414 వ కార్యక్రమంగా అనుపమాన సంగీత గేయధార జరిగింది.ఈ సంగీత గేయధారకు సంచాలకులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.మోహన శ్రీ వ్యవహరించగా , ప్రాశ్నికులుగా ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర , కవి, విమర్శకులు డాక్టర్ కాసల నాగభూషణం, నూకల హనుమంతరావు, శోభారాజా,తెలుగు అధ్యాపకులు డాక్టర్.పి.ఎస్.మైథిలిలు పాల్గొన్నారు. వివిధ అంశాలను, పలు రాగలను చెప్పగానే సాయికృష్ణ యాచేంద్ర వెంటనే ఆశువుగా రాగ తాళ యుక్తంగా తనదైన శైలిలో గేయాలను శ్రావ్యంగా అలపించి అలరించారు.దీంతో ఈ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 14 ఏళ్ళు తరువాత చెన్నై ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాషలోని విజ్ఞానాన్ని, గొప్పతనాన్ని ఆస్వాదించి సమాజానికి తెలియజేయాలని విద్యార్థులకు తెలిపారు. మళ్ళీ అవకాశం ఇస్తే చెన్నై లో తరిగొండ వెంగమాంబ పై కార్యక్రమం చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భాష అభిలాష పేరిట భాషామతల్లికి నీరాజనం పలుకుతూ తెలుగు భాష సాహిత్యాలకు సేవచేస్తున్న వారికి అవార్డులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు.ఇందులో ధ్రువతార పురస్కారాన్ని మద్రాసు క్రైస్తవ కళాశాల-తాంబరం తెలుగుశాఖాధ్యక్షులు డా.ఎస్.యజ్ఞశేఖర్ , ప్రభుత్వ మహోన్నత పాఠశాల- కె.జి.కండిగ తెలుగు ఉపాధ్యాయులు ఎ. మునిరత్నంలకు, అభిజ్ఞ పురస్కారాన్ని మన తెలుగు ఫౌండేషన్ నిర్వహకురాలు లావణ్య శ్రీనివాస్ ,తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజులకు, ఉద్భవ పురస్కారాన్ని హరిజన సేవా సంఘం తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు పి..మారుతి లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్,కళాశాల ప్రధానాచార్యులు డా.టి.మోహనశ్రీ ,తెలుగుశాఖ అధ్యాపకులు డా.పి.ఎస్.మైథిలి ,విద్యార్ధుల కార్యదర్శులు సి.కె.నందిని,డి.మానస, ఎన్.భానుశ్రీ, బి.పూజితలు పాల్గోన్నారు.

About Author