September 20, 2024

కరుణ, క్షమాగుణం నేర్పిన ఏసు ప్రభువు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి-సిస్టర్ మార్తా సంజయ్

చెన్నై న్యూస్: చెన్నై వేపేరి లోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘం (ఎం సి టి బి సి) లోని స్త్రీల సమాజము ఆధ్వర్యంలో ఒక దిన స్త్రీల రిట్రీట్ ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. స్త్రీల సమాజం ప్రెసిడెంట్ ఎస్.దానమ్మ , సెక్రెటరీ జి.రూతమ్మ, కోశాధికారి ఎం. రాణి, ఇంకా దీనమ్మ ,జె.జయమ్మ, ఎం .సౌదామని ,రెవరెండ్ సరోజా, ఎం .సువార్త తదితరులు సమక్షంలో ఈ స్త్రీల రిట్రీట్ చక్కగా సాగింది. ఈ సందర్భంగా ” క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి ” అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కు చెందిన సిస్టర్ పి.మార్తా సంజయ్ పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. క్రీస్తు మనస్సును గురించి వివరిస్తూ యేసు క్రీస్తు మనస్సు ఎటువంటిది అంటే కనికరము కలిగిన మనస్సు, విధేయత చూపించే మనస్సు, తగ్గింపు మనస్సు , వెలివేసిన వారిని ఆదుకునే మనస్సు, నశించిపోతున్న ఆత్మలను విడిపించే మనస్సు ,అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్సు అని ఇటువంటి మనస్సు కలిగిన యేసు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా ఉపదేశించారు. ఈ కార్యక్రమానికి తనను ప్రేమతో ఆహ్వానించిన సంఘ నిర్వహకులకు , సంఘ కాపరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు బైబిల్ ఆవేదన పేరుతో సిస్టర్ ప్రిన్సీ సారధ్యంలో జూనియర్ స్త్రీలు ప్రదర్శించిన ప్రత్యేక నాటకం అందర్నీ ఆలోచింప జేసింది. బైబిల్ గొప్పతనాన్ని తెలియజేయడమే కాకుండా బైబిల్ ని ఏవిధంగా భద్రపరుచుకోవాలన్న చక్కని సందేశాన్ని తెలియజేశారు. అలాగే బైబిల్ క్విజ్ , భక్తి పాటలు, బైబిల్ గేమ్స్ , రైటింగ్ స్కిల్స్ వంటి పోటీలను నిర్వహించగా, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా సంఘకాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్త్రీల సమాజం తరపున మంచి కార్యక్రమాలు నిర్వహించటం ,యువతీ యువకులలో మరింతగా దైవభక్తిని పెంపొందేలా చేయటం పై అభినందించారు.అలాగే దైవ సందేశాన్ని సిస్టర్ మార్తా సంజయ్ స్వచ్ఛమైన తెలుగులో మంచి సందేశాన్ని తెలియజేశారని ప్రశంసించారు. స్త్రీల సమాజం సెక్రటరీ జి. రూతమ్మ81వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా ఆశీర్వదించి రెవరెండ్ రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ కార్యవర్గం తరపున రూతమ్మ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జి.రూతమ్మ మాట్లాడుతూ ప్రస్తుత సంఘ కార్యవర్గం చాలా చక్కగా సంఘాన్ని అభివృద్ధి చేస్తుందని ఆశీర్వదించారు. ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని దీవించారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను సంఘ అధ్యక్షులు గాలిమట్టి రామయ్య, కార్యదర్శి పోతల ప్రభుదాస్, కోశాధికారి అనమలగుర్తి బాబు లు పర్యవేక్షించారు.
….

About Author