November 22, 2024

ఘనంగా టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు పుట్టిన రోజు వేడుకలు

చెన్నై న్యూస్:ఆదిఆంధ్రులు, అరుంధతీయులు, పారిశుధ్య కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని తమిళనాడు అదిఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) వ్యవస్థాపకులు,జనోదయం సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు అన్నారు. ఇశ్రాయేలు 59వ పుట్టిన రోజును టామ్స్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకున్నారు. చెన్నై పెరియమెట్ లోని సాల్వేషన్ ఆర్మీ సోషల్ సర్వీస్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టామ్స్ 23వ రాష్ట్రస్థాయి కార్యనిర్వాహకుల సమావేశం టామ్స్ అధ్యక్షులు నేలటూరు విజయకుమార్ నేతృత్వంలో నిర్వహించగా,అన్ని జిల్లాల నిర్వాహకులు సుమారు 75 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అరుంధతీయులకు ఉచిత ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని, రిజర్వేషన్ దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పించాలని తదితర తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పుట్టిన రోజు సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేలును రాష్ట్రప్రభుత్వ విద్యుత్ బోర్డు అదనపు కార్యదర్శి జీసీ నాగూర్, మాస్ సంస్థ అధ్యక్షుడు, శాస్త్రవేత్త డాక్టర్ కొల్లి రాజు, అఖిల భారత తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ ,టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయకుమార్ తదితరులు పుష్ప కిరీటం , నిలువెత్తు గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రేటర్ చైన్నై కార్పోరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ తిరుమల రావు , టామ్స్ ప్రముఖులు స్వర్ణ జయపాల్, అద్దంకి ఐసయ్య,బి ఎన్ బాలాజీ, వి.దేవదానం, పాల్ కొండయ్య, ఆరోన్ సహా పలువురు అధికారులు, వివిధ తెలుగు సంఘాల నిర్వాహకులు, టామ్స్, జనోదయం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ టామ్స్ నిర్వహకులు, సభ్యుల సహకారంతో 23 ఏళ్లుగా అణగారిన వర్గాల ప్రజల మధ్య సేవ చేయగలుగుతున్నానని అన్నారు. టామ్స్ కార్యక్రమాలను ఇక పై విస్తృతంగా చేపట్టాలని సబ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరై తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

About Author