December 25, 2024

జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (జెట్‌)–చెన్నై ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక భజన పోటీలకు అనూహ్య స్పందన

చెన్నై న్యూస్:జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (జెట్‌)–చెన్నై విభాగం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి మంగళాశాసనాలతో జులై 14వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వార్షిక భజన పోటీలకు అనూహ్య స్పందన లభించింది. దీనికి చెన్నై టి. నగర్‌ , జిఎన్‌ శెట్టి రోడ్డులోని వాణీమహాల్‌ వేదికైంది. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ –చెన్నై అధ్యక్షులు పి . రవీంద్రకుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈపోటీలకు చెన్నైనగరంలోని వివిధ ప్రాంతాలల్లో ఉన్న పాఠశాలల నుంచి 25 బృందాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. సీనియర్‌ కేటగిరిలో 18 టీమ్‌లు,జూనియర్‌ కేటగిరిలో 7 టీమ్‌లు పాల్గొని రాముడు,కృష్ణుడు , నారాయణుడు, నరసింహుడు, రామానుజులు, నామ సంకీర్తనలు, భజనపాటలను చిన్నారులు ఎంతో శ్రావ్యంగా ఆలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. జెట్‌ – చెన్నై కమిటీ సభ్యులు భజన పోటీల ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ 1993 సంవత్సరంలో చిన్నజీయర్‌ స్వామి వారు జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ –చెన్నై విభాగాన్ని ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా వార్షిక ఆధ్యాత్మిక పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతనను, నైతిక విలువలను, సంస్కృతి సంప్రదాయాలను పెంపొందింపజేస్తున్నట్టు తెలిపారు. చిన్నజీయర్‌స్వామి సూచించిన మార్గంలో పయణిస్తూ జెట్‌–చెన్నై అనేక సేవాకార్యక్రమాలను చేపడుతుందన్నారు. . చిన్ననాటి నుంచే ఆథ్యాత్మిక భావాలను పెంపొందింప జేస్తూ భవిష్యత్‌లో ఉత్తమ పౌరులుగా ఎదిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు.జెట్‌ –చెన్నై పోటీలకు శ్రీసిటీ,గోపురం పసుపు సంస్థ, విపిఆర్, నాయుడు హాలు నిర్వాహకులతో సహా ఎంతో మంది దాతల సహయ సహకారాలు అందిస్తున్నారని వారికి జెట్‌ –చెన్నై తరపున ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.

సీనియర్ కేటగిరీలో మొదటి బహుమతిని జి ఆర్ టి మహాలక్ష్మి విద్యాలయ, పి ఎస్ బి బి -కె కె నగర్ టీమ్ లు గెలుచుకోగా, రెండో బహుమతిని శ్రీ విద్యావాణి సంగీత విద్యాలయ, మూడో బహుమతిని పి ఎస్ బి బి -టి.నగర్ గెలుచుకుంది.అలాగే జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతిని పి ఎస్ బి బి -కె కె నగర్ , రెండో బహుమతిని పి ఎస్ బి బి -టి.నగర్, సందీపణి విద్యాలయ టీమ్ లు గెలుచుకోగా, మూడో బహుమతిని జి ఆర్ టి మహాలక్ష్మి విద్యాలయ -అశోక్ నగర్ టీమ్ గెలుచుకుంది.ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన బృందాలకు పివిఆర్‌ కృష్ణారావు తో కలసి P. రవీంద్రకుమార్‌ రెడ్డి తదితరులు సర్టిఫికేట్‌లు, జ్ఞాపికలను అందించి ఆశీర్వదించారు.

About Author