November 13, 2024

జీసస్ డిసైబుల్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయకాలు వితరణ

చెన్నైన్యూస్:జీసస్ డిసైబుల్స్ ఫెలోషిప్ 7వ వార్షికోత్సవ వేడుకలను చెన్నై కొరుక్కుపేట సమీపంలోని కార్నేష్ నగర్ లో ఉన్న డ్యానీయేల్ స్కూల్ ప్రాంగణంలో మార్చి 30వ తేదీ శనివారం ఘనంగా జరుపుకున్నారు.ఫెలోషిప్ సభ్యులు అరుణకుమారి ,భారతి, కె.జ్యోతి, ఐ.జ్యోతి, రెబేకా, రజని, ప్రతిభ, ప్రమీలా, దెబోరా, శాంతి కుమారి, మేరీ డేనియల్, సరోజా, విజయకుమారి ల ఆధ్వర్యంలో చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు 108 మందికి నెలకు సరిపడా కిరాణా సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా డేనియల్ స్కూల్ అధినేత డి ఎస్ సౌందర పాండియన్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న13 మంది మహిళామణులు సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న తలంపుతో ప్రారంభించిన జీసస్ డిసైబుల్స్ ఫెలోషిప్ ద్వారా ప్రతీ ఏటా ఈస్టర్ పర్వదినం సందర్భంగా సమాజంలోని దివ్యాంగులను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు.అంధులకు కళ్ళు లేకపోయినా దేవుడు మంచి జ్ఞానాన్ని ప్రసాదించారని చెప్పారు. బ్రెయిలీ లిపితో కూడిన బైబిల్ లను అవసరమైన వారికి అందిస్తానని హామీ ఇచ్చారు.విశిష్ట అతిధులు క్రిష్టినా జయంతి, జాన్ సుధాకర్ లు దైవ సందేశాన్ని అందించారు. అనంతరం మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి పోతల ప్రభుదాస్ ఫెలోషిప్ మహిళా సభ్యుల సేవలను ప్రశంసిస్తూ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మహిళలు సేవాభావంతో తాము నెలనెలా పోగుచేసిన డబ్బుతో ,పలువురు దాతల సాయంతో అణగారిన వర్గాలకు చేయూత నివ్వటం నిజంగా హర్షణీయం అని అన్నారు. ఈ సేవలను మరింతగా విస్తృతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్నదానంలో 300 మందికి పైగా పాల్గొన్నారు.

About Author