November 13, 2024

తెలుగు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి- ఆస్కా అధ్యక్షులు డాక్టర్ కె.సుబ్బా రెడ్డి

చెన్నై న్యూస్ :తెలుగు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) అధ్యక్షులు డాక్టర్ కె.సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.
చెన్నై విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గ తెలుగు మహోన్నత పాఠశాల ( S K D T )లో 6వ తరగతి నుంచి ఫ్లస్‌ టూ వరకు చదువుతున్న 500 మంది విద్యార్థిని విద్యార్థులకు ఆస్కా ట్రస్ట్‌ తరపున నోట్‌ పుస్తకాలు, స్కాలర్‌ షిప్‌ ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ సీఎం కిషోర్‌ అధ్యక్షత వహించారు. ఇందులో ఆస్కా అధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, ఆస్కా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీనివాసులు రెడ్డి, ట్రస్ట్‌ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి, ట్రస్ట్‌ సభ్యులు జానకీ రామ్, శ్రీనాధ్, అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు లు పాల్గొని విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, స్కాలర్‌ షిప్‌ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆస్కా అధ్యక్షులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని పేర్కొంటూ విద్యార్థులు బాగా చదివి ఉత్తమ మార్కులు సాదించాలన్నారు. మెరిట్‌ సాధించిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఆస్కా ట్రస్ట్‌ తరపున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మాతృభాషను మరవద్దని, తెలుగులో చదువుకున్న వారంతా ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్నారని, అందువల్ల మాతృభాషను నిర్లక్ష్యం చేయోద్దని సూచించారు. ఎస్‌ కె డి టి పాఠశాలకు ఇంకా కంప్యూటర్లుతో పాటు ఏమైనా ఇతర సదుపాయాలు కావాలంటే సహాయ సహకారాలు అందిస్తామని ఆస్కా ట్రస్ట్‌ తరపున హామీఇచ్చారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తెలుగు విద్యార్థులకు ఆస్కా ట్రస్ట్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థులు ఉన్నత చదువులతో ఉజ్వలంగా రాణించాలని ఆకాంక్షించారు. సీఎం కిషోర్‌ మాట్లాడుతూ ఎస్‌ కె డి టి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గత 14 సంవత్సరాలుగా ఆస్కా ట్రస్ట్‌ ఉదార స్వభావంతో నోట్‌ పుస్తకాలను, వెనుకబడిన మరియు మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ లను సైతం అందించటం పై ఆస్కా ట్రస్ట్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు.SKDT పాఠశాలల కార్యదర్శి పి .శ్రీనివాస రావు ఏర్పాటును పర్యవేక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె . సారా సుహాసిని స్వాగతోపన్యాసం చేయగా, అసిస్టెంట్‌ హెచ్‌ ఎం మోహన్‌ నాయుడు వందన సమర్పణ గావించారు. ముఖ్య అతిధులను పాఠశాల కార్యవర్గం ఘనంగా సన్మానించింది

About Author