November 21, 2024

పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు – ఆస్కా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పి. శ్రీనివాస్ రెడ్డి.

చెన్నై న్యూస్: పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు ఆస్కా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు. ఆస్కా ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నై మైలాపూర్ లోని కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల వితరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఆస్కా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పి.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి తో పాటు ట్రస్ట్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి,ట్రస్ట్ కోశాధికారి కోటేశ్వరరావు , సభ్యులు శ్రీనాథ్ తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి P. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థుల విద్యాభి వృద్ధికి ఆస్కా ట్రస్ట్ ద్వారా చేయూత నందిస్తున్నామని అన్నారు.నగరంలోని అన్ని తెలుగు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలే , కాకుండా స్కాలర్ షిప్ లను సైతం అందిస్తున్నామని తెలిపారు .2024 -25 విద్యా సంవత్సరానికి గాను నగరంలోని అన్ని తెలుగు పాఠశాలలకు సుమారు రూ.6 లక్షల విలువచేసే నోటు పుస్తకాలతో పాటు మొదటి విడతగా రూ.5 లక్షల మొత్తాన్ని స్కాలర్ షిప్ లుగా తెలుగు విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది విద్యార్థులు ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నందు వలన, వారిని మరింతగా ప్రోత్సహించే రీతిలో ఆస్కా ట్రస్ట్ అండగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి , ట్రస్ట్ కోశాధికారి కోటేశ్వరరావు లు మాట్లాడుతూ తెలుగు విద్యార్థుల కోసం ఆస్కా ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందని ,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ఆస్కా ట్రస్ట్ కార్యవర్గాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి, కెమిస్ట్రి ఉపాధ్యాయులు శివ సుబ్రహ్మణ్యం, ఎకనామిక్స్ ఉపాధ్యాయులు కార్తీక్ తదితరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆస్కా ట్రస్ట్ తరపున తమ పాఠశాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న కేసరి శిలా విగ్రహానికి పి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు నివాళ్లు అర్పించారు.
వందన సమర్పణను తెలుగు ఉపాధ్యాయిని పి.సునీత చేశారు.

About Author