December 23, 2024

మద్రాసు వర్శిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ క్రోధి ఉగాది వేడుకలు

చెన్నై న్యూస్:పంచాంగ పఠనం…ఉగాది ప్రసంగాలు ..పుస్తకావిష్కరణలు…ఉగాది పురస్కారాలు….ఉగాది కవి సమ్మేళనాలు …సంగీత కార్యక్రమాలు ఇలా షడ్రుచులను తలపించేలా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ నిర్వహించిన శ్రీ క్రోధి నామసంవత్సర ఉగాది వేడుకలు ఆధ్యంతం అబ్బుర పరిచాయి.

తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షతన ప్రారంభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలికారు. అరుణా శ్రీనాథ్ ప్రార్ధనతో వేడుకలు ప్రారంభమైయ్యాయి. ముందుగా విస్తాలి శంకర రావు మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగను తెలుగు వారి సమక్షంలో తెలుగుశాఖలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అందరికి క్రోధి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనచంద్ర ఉగాది పర్వదినం తెలుగువారికి ప్రత్యేకమైదని అటువంటి రోజుని తెలుగుశాఖలో ఆచార్య విస్తాలి శంకరరావు తెలుగువారి మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారిని అభినందించారు. ఈ ప్రారంభ సమావేశంలో భాగంగా రచయిత్రి కమలాకర రాజేశ్వరి ఉగాది విశిష్టతను శ్రోతలకు తెలియజేశారు. ముందుగా డా. టి.ఆర్.ఎస్. శర్మ పంచాగ పఠనం గావించారు.
వేడుకలు సందర్భంగా మూడు పుస్తకాలను భువనచంద్ర ఆవిష్కరించారు. అందులో మొదటగా లింగంనేని సుజాత రచించిన ‘మనిషి కథలు’ (కథా సంపుటి)ని తన భర్త ఆచార్య లింగంనేని బసవ శంకరరావుగారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథాన్ని డా. తిరుమల ఆముక్తమాల్యద సమీక్షించారు. రెండవ పుస్తకం గుడిమెట్ల చెన్నయ్య రచించిన ‘ఎక్కడుంది న్యాయం’ (కవితా సంపుటి)ని డా. మామిడి మురళి సమీక్షించారు. మూడవ పుస్తకం డా. విశ్వర్షి వాసిలి వసంత కుమార్ రచించిన ‘జీవన సంహిత’ (కవితాత్మికలు) పుస్తకాన్ని ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ సమీక్షించారు.
అనంతరం తెలుగుశాఖ తరపున ఉగాది పురష్కారాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు బూసి వెంకటస్వామి కి అందించారు. డా. బూసి వెంకటస్వామి తన స్పందనలో మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉగాది పురస్కారన్ని అందుకోవడం ఎంతో అదృష్టం అని కృతజ్ఞతలు తెలిపారు. చివరగా తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. మాదా శంకరబాబు వందన సమర్పణతో ఈ కార్యక్రమం పూర్తయింది.

మధ్యాహ్నం ఉగాది విందు అనంతరం ఉగాది కవిసమ్మేళన సభను గాయని వసుంధర దేవి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తమ్మినేని బాబు మాట్లాడుతూ ఉగాది తెలుగువారికి ఆది పండుగని, అలాంటి పండుగను విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విచ్చేసి ఉగాది కవితలను చదివి అలరించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణవేణి జాన్సీలక్ష్మీబాయ్ వేషధారణలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. చివరగా ‘ఆనంద లహరి’ పేరిట సంగీత దర్శకులు ఎం.ఆర్. సుబ్రహ్మణ్యం సారథ్యంలో సాగిన సంగీత కార్యక్రమంలో అరుణా శ్రీనాథ్, నిడమర్తి వసుంధరాదేవి, వంజరపు శివయ్య, జె. తిరుపతయ్య, ఆచార్య విస్తాలి శంకరరావు లు ఎంతో చక్కటి సంగీతంతో శ్రోతలకు వీనుల విందు అందించారు.

About Author