November 14, 2024

శ్రీశ్రీతో ఉన్న అనుబంధం మరువలేనిది- ఆచార్య ఎం జె ప్రసాద్ వ్యాఖ్య

ఓ వైపు హాస్య చతురోక్తులు …మరో వైపు ఆధునిక తెలుగు కవి శ్రీశ్రీ తో ఉన్న మరువలేని జ్ఞాపకాలు సమాహారం…ఇంకో వైపు అచ్చతెలుగులో మాట్లాడే పోటీలు వెరసి ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహించిన ప్రత్యేక సాహితీ కార్యక్రమం ఆధ్యంతం ఆహ్లాదకరంగా సాగింది.

     ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూ టి ఎఫ్ ) ఆధ్వర్యంలో హాస్య చతురోక్తులు, ఆధునిక తెలుగు కవి శ్రీశ్రీ గారితో తనకున్న అనుబంధం పై ప్రత్యేక సాహితీ  కార్యక్రమం ఫిబ్రవరి 8వ తేదీ  గురువారం సాయంత్రం జరిగింది.చెన్నై  టి.నగర్ , జి ఎన్ చెట్టి రోడ్ ,అంకూర్ ప్లాజా లో ఉన్న ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యాలయం వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహనరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి వక్తగా  మోటివేషనల్ స్పీకర్ ఆచార్య ఎం జె ప్రసాద్  పాల్గొని హాస్య చతురోక్తులు,ఆధునిక తెలుగు కవి శ్రీశ్రీ గారితో తనకున్న అనుబంధం పై మాట్లాడటమే కాకుండా తనదైన శైలిలో హాస్యపు వల్లరితో సభలో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ఫోన్ సంభాషణలను నిజ జీవితానికి అన్వయిస్తూ సాగిన ఎం జె ప్రసాద్ ప్రసంగం ఆధ్యంతం అలరించింది. ప్రత్యేకించి మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ)తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎంతో ఆసక్తికరంగా తెలియజేశారు. ప్రపంచంలోనే ముగ్గురు గొప్ప కవుల్లో శ్రీశ్రీ  ఒకరని , వారితో తనకు ఉన్న అనుబంధం  జీవితంలో మారువరానిదని వ్యాఖ్యానించారు. ముందుగా డబ్ల్యూ టి ఎఫ్ కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహనరావు స్వాగతోపన్యాసం చేస్తూ వైవిధ్యమైన సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తూ డబ్ల్యూటీఎఫ్ తెలుగు భాష, సాహితీ సేవ చేస్తుందన్నారు.అంతే కాకుండా   ప్రముఖ వ్యక్తులను గురించి పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు వక్తగా పాల్గొన్న ఎం జె ప్రసాద్ గారు శ్రీ శ్రీ గురించి  గొప్పగా ప్రసంగించటంతో పాటు పలు హాస్యపు మాటలతో సభలో నవ్వులు పూయించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డబ్ల్యూ టి ఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ వి. ఎల్. ఇందిర దత్ సభకు అనివార్యకారణాల వల్ల రాలేక పోవటంతో ఆమె అందించిన సందేశాన్ని కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన రావు సభలోని వారికి వినిపించారు. అనంతరం లలిత సుధాకర్  నేతృత్వంలో మూడు నిమిషాల తెలుగు సంభాషణం పేరిట  పోటీలను నిర్వహించగా, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. వివిధ అంశాలపై ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడి అలరించారు.ఇందులో ఇంద్రగంటి పార్వతీదేవి,ఉప్పులూరి విజయలక్ష్మి,  కె. రమణి, డాక్టర్ ఏవి

శివకుమారి, సునీత, ఊరా శశికళ, సీత, అరుణ శ్రీనాథ్ తదితరులు ప్రసంగించి ఆకట్టుకున్నారు.ఈ పోటీల్లో విజేతలకు బహుమతులను బహుకరించారు.ముందుగా అరుణా శ్రీనాథ్ ప్రార్ధన గీతాన్ని ఆలపించగా, వక్త ఆచార్య ఎంజె ప్రసాద్ ను పిఆర్ కేశవులు సభకు పరిచయం చేశారు.చివరగా వందన సమర్పణను శ్రీలక్ష్మి మోహన రావు చేసి అతిథులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డబ్ల్యూ టి ఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రమీల ఆనంద్ , ప్రముఖాంద్ర సంపాదకులు గోటేటి వెంకటేశ్వరరావు ,వూరా ఆంజనేయులు, శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్, మహిళా సభ్యులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు గా తాతినేని జయశ్రీ, లలిత సుధకర్ లు వ్యవహరించారు.
..

About Author