December 24, 2024

శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

చెన్నై న్యూస్:భోగి మంటలు, పొంగళ్లు పొంగించటం, రంగవళ్లులు, కోలాటాలు, హరిదాసు పాటలు,గంగిరెద్దుల విన్యాసం, సంప్రదాయ ఆటలు, వంటల పోటీలు ఆంంధ్ర కళా స్రవంతి నిర్వహణలో కొనసాగుతున్న చెన్నై కొరట్టూరు అగ్రహారంలోని కోదండ రామాలయం ప్రాంగణం సంక్రాంతి శోభతో నిండిపోయింది. చిన్నా పెద్దా అంతా కలసి ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో జనవరి 14 వతేది ఆదివారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. స్రవంతి అధ్యక్షులు జే. ఎం. నాయుడు, సలహాదారులు ఎంఎస్ మూర్తిలు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో స్రవంతి కార్యవర్గసభ్యులు, మహిళా సభ్యులతోపాటు నగరానికి చెందిన 200మందికిపైగా కళాకారులు పాల్గొన్నారు. ఓ వైపు పొంగళ్లు పొంగించటం, మరో వైపు ముచ్చటగొలిపే రంగురంగుల రంగవళ్లులు, ఇంకో వైపు రుచికరమైన వంటల పోటీల్లో మహిళలు సందడి చేశారు. ముగ్గుల పోటీలకు ఆకాశవాణి -చెన్నై రిటైర్డ్ ఉద్గోషకురాలు బిట్రా గజగౌరి , వంటలు పోటీలకు అరుణా శ్రీనాధ్ ,అలాగే స్రవంతి ఉపాధ్యక్షులు వి .ఎన్. హరినాథ్, కుమార్ ,మనోహరన్ , లోకనాథన్ ల నేతృత్వంలో ఆటల పోటీలు చక్కగా నిర్వాహించారు.అలాగే ఉప్పులూరి విజయలక్ష్మీ సారధ్యంలో కళాకారుల సంప్రదాయ కోలాట నృత్యాలు ఎంతో
మురిపించాయి. ఇంకా హర్షిణి , తేజశ్వేనిల భరతనాట్య ప్రదర్శనలు, సంగీతగాయనీ
మణులు అరుణాశ్రీనాథ్, వసుంధర ల హరిదాసు పాటల అందరినీ అలరించాయి. ఈ సంక్రాంతి పోటీలు స్రవంతి మహిళా సభ్యులు శేషారత్నం, అన్నపూర్ణ, సరస్వతి నేతృత్వంలో విజయవంతంగా సాగాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆంధ్ర కళా స్రవంతి తరపున బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమ పర్యవేక్షణను స్రవంతి కోశాధికారి బి వి రమణ నిర్వహించగా, వందన సమర్పణను స్రవంతి ఉపాధ్యక్షులు కె ఎన్ సురేష్ బాబు చేశారు.ఈ వేడుకల్లో స్రవంతి సెక్రటరీ శ్రీనివాస్ , రవీంద్రన్, బాలాజీ, కాశీవిశ్వనాధం , తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా రామాలయంలో స్వామివారికి అభిషేకాలు పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జె ఎం నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
..

About Author