December 17, 2024

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

చెన్నై న్యూస్ : సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏ ఐ టి ఎఫ్ )అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ సి ఎం కె రెడ్డి వ్యాఖ్యానించారు. అందమైన ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం నేత్రం అని అందువల్ల కళ్ళను జాగ్రత్తగా ఆపాడుకోవాలని విద్యార్థులకు ఆయన హితవు పలికారు.ఏ ఐ టి ఎఫ్ చీఫ్ ప్యాట్రన్ , ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ సి మోహన్ రెడ్డి 3వ వర్ధంతిని పురస్కరించుకుని చెన్నై విల్లివాక్కం లోని శ్రీ కనక దుర్గ తెలుగు మహోన్నత పాఠశాలలో నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా , ఉచిత నేత్ర వైద్య శిబిరం, నైపుణ్య విద్యకు సంబందించిన కార్యక్రమాలు , అవార్డు ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సి ఎం కిషోర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఎం ఎన్ నేత్ర ఆసుపత్రి సహకారంతో నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సహా స్థానిక ప్రజలకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. వీరిలో క్యాట్రాక్ట్ సర్జరీకి ఎంపికైన వారికి నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచిత శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్టు ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ,సభాధ్యక్షులు డాక్టర్ సి ఎం కిషోర్ ఈ సందర్భంగా ప్రకటించారు.

ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ డాక్టర్ సి ఎం కె రెడ్డి , ప్రత్యేక ఆహ్వానితులు పిఐబీ డిప్యూటీ డైరెక్టర్ జె.విజయలక్ష్మి, మద్రాసు హైకోర్టు న్యాయవాది వి.దీపన్ రాజ్ కృష్ణ, ఊవియాస్ గ్రూప్ సీఈఓ ఎస్. లత హాజరై ఉచిత నేత్ర వైద్య శిబిరం, అలాగే ఉచిత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంఛనంగా ప్రారంభించారు.ఏ ఐ టీ ఎఫ్ ప్రధాన కార్యదర్శి ,ట్రస్టీ నాయకర్ డాక్టర్ ఆర్ నందగోపాల్ ఆహూతులకు సాదరస్వాగతం పలికారు. ముందుగా వేదిక పై అలంకరించిన డాక్టర్ సి. మోహన్ రెడ్డి చిత్ర పటానికి అతిథులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహకులతో కలసి సీఎంకే రెడ్డి నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో విద్య ప్రధాన మైనదని భావించి ఎస్ కె డి టి పాఠశాలల అభివృద్ధికి మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఎల్ కె జి నుంచి ప్లస్ టూ వరకు నైపుణ్యంతో కూడిన ఉచిత విద్యను అందించేందుకు ఆయన పాటుపడ్డారని కొనియాడారు.విద్యార్థి దశ నుంచే బాలబాలికలు వివిధ వృత్తులపై నైపుణ్యం పెంపొందించుకోవాలనే మోహన్ రెడ్డి ఆశయాల మేరకు ఉచిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని మనపెద్దలు ఎప్పుడో చెప్పారని పేర్కొంటూ దేహంలో ముఖ్యమైన భాగమైన నేత్రాలను కాపాడుకోవాలని విద్యార్థులకు,ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ టీ ఎఫ్ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి ఇజ్రాయెల్ టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయ కుమార్, ఊటుకూరు దేవదానం,పుళల్ కావంగరై తెలుగు ప్రజ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు లయన్ జి.మురళి,పాఠశాల నిర్వాహకులు నరసింహులు, శ్రీనివాసరావు,డాక్టర్ శరవణన్ ,ప్రధానోపాధ్యాయులు శారా సుహాసిని, అసిస్టెంట్ హెచ్ ఎం మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సంఘ సేవకుడు కళ్యాణ సుందరం కు మోహన్ రెడ్డి పేరుతో అన్నదాత పురస్కారాన్ని ప్రదానం చేశారు. వందనసమర్పణను నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ ఎన్.నాగభూషణం చేశారు.
…..

About Author