November 13, 2024

స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన దుర్గాబాయి దేశ్ ముఖ్-డాక్టర్ ఏ వి శివకుమారి

చెన్నై న్యూస్:స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్ ముఖ్ అని సమావేశంలో పాల్గొన్న వక్తలు కొనియాడారు
స్వాతంత్ర సమరయోధురాలుగా, రచయిత్రి గా, సంఘ సంస్కర్తగా , భారత రాజ్యాంగ నిర్మాణం కమిటీలో ఏకైక మహిళగా చరిత్రలో నిలిచి పోయిన దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సమాజానికి స్పూర్తినిచ్చారని వ్యాఖ్యానించారు.
శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్ కె పి సి)ఐక్యూఏసి, సృజన తెలుగు భాషా మండలి,దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళాసభ -చెన్నై నిర్వహణలో ఉన్న దుర్గా స్రవంతి (సాంస్కృతిక విభాగం) సంయుక్త ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ 115వ జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర విశేషాలతో అవగాహన శిబిరం సోమవారం నిర్వహించారు. తెలుగు మీడియం విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని చక్కగా దుర్గాబాయి చరిత్ర గురించి అనర్గలంగా ప్రసంగించారు. ఎస్ కె పి సి కరస్పాండెంట్ ఊటుకూరి శరత్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.మోహన శ్రీ, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పి ఎస్ మైథిలి, డాక్టర్ భరణి కుమార్, దుర్గా స్రవంతి కి చెందిన భానుమతి , కార్యవర్గ సభ్యులు పసుమర్తి జయశ్రీ, డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద , పద్మలత, లక్ష్మీ ప్రసన్న, అనురాధ తదితర ప్రముఖులు దుర్గాబాయి దేశ్ ముఖ్ దేశభక్తి, మహిళలకు అందించిన ఎనలేని కృషిని కొనియాడారు.మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్ధనాగీతంతో ప్రారంభమైన ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సౌత్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్.ఏ.వి.శివకుమారి పాల్గొని మాట్లాడుతూ మహిళా లోకానికి దుర్గాబాయ్ దేశ్ ముఖ్ స్ఫూర్తి ప్రదాత అని, స్వాతంత్ర్య సమరంలో ముందుండి నడిపించిన వీర వనిత అని కీర్తించారు.దుర్గాబాయి దేశ్ ముఖ్ జీవిత చరిత్ర గురించిన వక్తృత్వ పోటీలో ప్రధమ స్థానంలో నిలిచిన బీసీఏ మూడో సంవత్సరం విద్యార్థిని సుప్రియకు దుర్గా స్రవంతి తరపున రూ.5 వేలు నగదు బహుమతి అందించి అభినందించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిలకు, అతిథులకు జ్ఞాపికలను నిర్వాహకులు బహుకరించారు.

About Author