December 23, 2024

వైభవంగా ఆడిపూరం అన్నకూట ఉత్సవం

చెన్నై న్యూస్ : చెన్నై షాపుకారుపేటలోని రెడ్డి రామన్ వీధిలో వెలసియున్న శ్రీ రామకృష్ణ చైతన్య మందిరంలో ఆడిపూరం సందర్భంగా నంబూరు వెంకట సుబ్రహ్మణ్యం శెట్టి ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నకూట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆడి నెల పూరం నక్షత్రంలో ఆండాళ్ ప్రసిద్ధి చెందిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూర్లో జన్మించి నిశ్చలమైన భక్తితో శాశ్వత మైన ముక్తిని పొందవచ్చునని 30 పాశురాలలో పొందుపరచి తిరుప్పావైగా మానవాళికి వివరించి, పన్నిద్దరు ఆళ్వా ర్లలో ఏకైక మహిళా భక్తురాలిగా సుస్థిర స్థానం సంపాదించారు. కృతజ్ఞతాపూర్వకంగా ఆడిపూరం రోజున భక్తిశ్రద్ధలతో అన్నకూట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో శ్రీ రామకృష్ణ చైతన్య మందిరంలోని వెంకట సుందరహాస పెరుమాళ్, ఆండాళ్ ఉత్సవమూర్తుల ఎదుట పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని రాశిగా పోసి పిండి వంటలతో నైవేద్యం సమర్పించి ఆరాధనలు చేశారు.అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ముందుగా మహామంత్ర భజన మండలి సభ్యుల భక్తి గేయాలాపనలు భక్తిభావాన్ని పెంచాయి. ట్రస్టీలు ఊటుకూరు శరత్ కుమార్, ఊటుకూరు అరవింద్, వి. జనార్దన రావు లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా వేంకట సుందర హాస పెరుమాళ్, సత్యనారాయణ స్వామి, రమాదేవతాయారు, ఆంజనేయస్వామి, అన్నపూర్ణేశ్వరి, గరుడాళ్వార్ లకు విశేష పూజలు నిర్వహించారు. భజన పాటలను ఆలపించిన కళాకారులను ట్రస్టీలు ఘనంగా సత్కరించుకొని అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ1962లో స్థాపించిన ఈ ట్రస్ట్ ఏటా ఆడి శుక్రవారం, ఆడిపూరం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నకూట మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో SKPD చారిటీస్ మాజీ ట్రస్టీ ఊరా ఆంజనేయులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహా హారతి అనంతరం భక్తులందరికీ తీర్థ అన్నప్రసాదాలు వినియోగించారు.

About Author