January 22, 2025

ఘంటసాల పాటలు అజరామరం – తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు

చెన్నై న్యూస్:మధురగాయకులు ఘంటసాల పాటలు అజరామరం అని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు కొనియాడారు.ఆయన పాటలు వింటుంటే మనసుకు హాయి కలుగుతుందని అభిప్రాయ పడ్డారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం -చెన్నై, జనని సాంఘిక సాంస్కృతిక సమితి-చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతి వేడుకలు డిసెంబర్ 4వ తేదీ బుధవారం ఘనంగా జరుపుకున్నారు. చెన్నై పెరంబూరులోని డీఆర్బీసీసీసీ మహోన్నత పాఠశాల ప్రాంగణం ఈ వేడుకలకు వేదికైంది. గాయని నిడమర్తి వసుంధర దేవి ప్రార్థనాగీతంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ముందుగా నిర్వాహకులు, వక్తలు, తెలుగు ప్రముఖులు కలసి ఘంటసాల చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

   జనని ప్రదాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ఘంటసాల, ఆయన పాడిన పాటలు చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు.  సభకు అధ్యక్షత వహించిన జనని అధ్యక్షురాలు డాక్టర్ నిర్మలా పళని వేలు మాట్లాడుతూ  గాన గంధర్వులు ఘంటసాల సంగీతానికే కాకుండా తెలుగు భాషకు ఎనలేని సేవలు చేశారని అభిప్రాయపడ్డారు.

అనంతరం వక్తలుగా పాల్గొన్న తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు ,రెప్కోబ్యాంకు -చెన్నై విశ్రాంతి జనరల్ మేనేజర్ వంజరపు శివయ్య, గాయకులు ఎంఆర్ సుబ్రమణ్యం, ఆకాశవాణి -చెన్నై కేంద్రం పెద్దాడ సాయి సూర్య సుబ్బలక్ష్మీలు ఘంటసాల సేవలను కొనియాడారు. సంగీత దర్శ కులు ,గాయకులు ఎంఆర్ సుబ్రమణ్యం బృందం వారిచే ఘంటసాల పాటలతో సంగీత విభావరి నిర్వహించారు. ఎం ఆర్. సుబ్రహ్మణ్యం, వంజరపు శివయ్య, శ్రీమతి వసుంధరా దేవి, కిడాంబి లక్ష్మీ కాంత్ లు ఘంటసాల పాటలతో ఆద్యంతం అలరించారు.ఎం ఆర్ సుబ్రహ్మణ్యం నమో వెంకటేశ అనే పాటతో భక్తిభావాన్ని చాటారు.గాయకులు కిడాంబి లక్ష్మీ కాంత్ ఎవరివో నీవేవరివో అనే పాటతో, వంజరపు శివయ్య పాడుతా తీయగా చల్లగా అంటూ ప్రేక్షకుల మనసుకు ఆహ్లాదాన్ని నింపారు. అనంతరం వసుంధరాదేవి, ఎం ఆర్ సుబ్రహ్మణ్యంలు కలసి మధురభావాల సుమ మాల, చిన్నారి పొన్నారి పువ్వు లాంటి ఎన్నో మధుర గీతాలను శ్రావ్యంగా ఆలపించి వీనుల విందు చేశారు.అలాగే ఘంటసాల సుస్వర స్వరం పాటల సమాహారం అనే కవితను
తెలుగు ప్రముఖురాలు రమాదేవి వినిపించి అలరించారు. ఈ ఘంటసాల జయంతి వేడుకల కార్యక్రమ నిర్వహణను సంఘం సెక్రెటరీ పి ఆర్ కేశవులు చేపట్టగా, వందన సమర్పణను NVV సారధి గావించారు.తెలుగు ప్రముఖులు శ్రీలక్ష్మి మోహన రావు, గూడపాటి జగన్మోహన్ రావు, చల్లగాలి బాబు తదితరులు పాల్గోన్నారు.

..

About Author