January 27, 2025

ఘనంగా అంబికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత దివంగత ఆలపాటి రామచంద్రరావు శత జయంతి

చెన్నై న్యూస్:అంబికా హోటల్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో అంబికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత దివంగత ఆలపాటి రామచంద్రరావు శత జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై వడపళనిలో గల అంబికా ఎంపైర్ హోటల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా హోటల్ లోని ఆలపాటి రామచంద్ర రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో అంబికా ఎంపైర్ హోటల్ జనరల్ మేనేజర్ కాలాతినాథన్, అడ్మిన్ పుష్ప, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, అపోలో హాస్పిటల్ మార్కెటింగ్ కు చెందిన రతీష్ తదితరులు పాల్గొని దివంగత ఆలపాటి రామచంద్రరావు సేవలను కొనియాడారు. హోటల్ జనరల్ మేనేజర్ కాలాతీనాథన్ మాట్లాడుతూ ఆలపాటి రామచంద్రారావు శత జయంతి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు.ఆయన కఠోర శ్రమతో కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు .ముందుగా అగర్బత్తి డివిజన్ తో ప్రారంభించి ఆ తరువాత వ్యాపారం ,హోటల్ డివిజన్, సినిమా, రియల్ ఎస్టేట్, విండ్ మిల్ రంగాలకు వ్యాపించినట్లు తెలిపారు. తమ హోటల్స్ చెన్నై, సేలం, విశాఖపట్నం, ఏలూరులలో ఉన్నట్లు తెలిపారు.

ఇందుకు తమ కంపెనీ చైర్మన్ అంబికా కృష్ణ కృషి ఎంతో ఉందన్నారు. తమ హోటల్స్ లో అతిథులకు నాణ్యమైన సేవలు అందిస్తామన్నట్టు తెలిపారు.శత జయంతి సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ అంబికా హోటల్స్ తో ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ ఒప్పందం చేసుకుని ఉందన్నారు .అంబికా కృష్ణ తమ సంస్థలో గ్లోబల్ లీడర్ గా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెడికల్ క్యాంపులో బ్లడ్ షుగర్ పరీక్షలతో పాటు డెంటల్, జనరల్ చెకప్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించటం పై నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన అంబికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత దివంగత ఆలపాటి రామచంద్రరావు స్ఫూర్తిప్రదాత అని ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ కొనియాడారు.ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author