April 4, 2025

తెలుగు వారంతా ఐక్యమత్యంతో సాగాలి-సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ పిలుపు

చెన్నై : తెలుగు వారి బలాన్ని, ఉనికిని పాలకులకు తెలియజేసేలా తెలుగు వారంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ , సీనియర్‌ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను మార్చి 29వ తేదీన ఘనంగా జరుపుకున్నారు .చెన్నై మైలాపూర్‌లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక మందిరం వేదికగా జరిగిన ఈ వేడుకలకు కమిటీ ఛైర్మెన్‌ కె అనిల్‌కుమార్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ , సీనియర్‌ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ , విశిష్ట అతిథిగా తమిళనాడు ప్రభుత్వ లా డిపార్టుమెంట్‌ అడిషనల్‌ సెక్రటరీ గుర్రం చిన నాగూర్‌ పాల్గొన్నారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొన్న తెలుగు కవులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందుగా అతిథులతో కలసి స్మారక భవనంలోని అమరజీవి శిలా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు . స్వాగతోపన్యాసంను కమిటీ కార్యదర్శి ,కోశాధికారి వి కృష్ణారావు చేశారు. అధ్యక్షోపన్యాసం ను కె .అనిల్‌కుమార్‌ రెడ్డి చేస్తూ ఉగాది వేడుకలు జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిధులను అందించటం పై హర్షం వ్యక్తం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలపై ఇటీవల ఆంధ్రజ్యోతి -తమిళనాడు దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం వల్ల ఈ భవనానికి చాలా ఏళ్ల తరువాత ఉగాది సందర్భంగా పూర్వవైభవం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

కవి, విమర్శకులు విద్వాన్‌ డాక్టర్‌ కాసల నాగభూషణం పాల్గొని కవులకు అభినందనలు తెలుపుతూ ఉగాది గొప్పతనాన్ని వివరించి ఆకట్టుకున్నారు . సభా నిర్వాహణను కమిటీ సభ్యులు డాక్టర్‌ విస్తాలి శంకర రావు గావించగా , వందన సమర్పణను కమిటీ సభ్యురాలు డాక్టర్‌ ఏవి శివకుమారి చేశారు . ఇందులో కమిటీ సభ్యులు జెఎం నాయుడు ,డాక్టర్‌ ఎంవి నారాయణ గుప్తా , భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు. .వేడుకల్లో భాగంగా ఐఐటీ -మద్రాసు లోని ప్రతిసృత్ ఆర్ట్ ఐఐటీఎం అనే సంస్థానం నుంచి నాట్య విశారద కల్పన శ్రీనివాస్ బృందం కూచిపూడి నాట్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది..

About Author