November 23, 2024

శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీ సీతారాములకు వైభవంగా విశేష పూజలు, హోమాలు.

చెన్నై న్యూస్ : జై శ్రీరామ్… జై శ్రీరామ్ జయ జయ రామ్ అంటూ శ్రీరామనామ స్మరణతో చెన్నై కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం
మారు మ్రోగింది.చిన్న ,పెద్దా అంతా కలిసి ఆదర్శ పురుషుడు శ్రీరామున్ని స్మరించుకుంటూ ప్రత్యేక పూజల్లో ,అభిషేకాల్లో పాల్గొని తన్మయత్వం పొందారు.శ్రీ సీతారాములను దర్శించుకుని పులకించిపోయారు.

  అయోధ్య శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ప్రాణ  ప్రతిష్ట వేడుకల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో  జనవరి 22వ తేదీ సోమవారం  చెన్నై కొరట్టూర్ అగ్రహారంలో వెలసియున్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ, లక్ష్మణ ,ఆంజనేయ స్వామి వార్లకు  ప్రత్యేక పూజలు ,అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. .అందరూ సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేశారు.ఆంధ్ర కళా స్రవంతి  అధ్యక్షులు జే .ఎం. నాయుడు అధ్యక్షతన ఏర్పాటైన ఈ వేడుక ఉదయం 7 గంటలకు శ్రీరామ జపంతో మొదలయ్యాయి.

అనంతరం పండితులు సుసర్ల కుటుంబ శాస్త్రి బృందంచే శ్రీరామ తారక హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.రామమందిరం నిర్మాణం, రాముని చరిత్ర ఘట్టాలను చక్కగా వివరిస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని పెంచారు.మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి అనంతరం మంగళ హారతి తో వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి.శ్రీ సీతారాముల ఆశీస్సులతో పాటు భక్తులందరికీ అయోధ్య అక్షింతలు , ప్రసాద వినియోగంను నిర్వాహకులు చేశారు.అలాగే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకను నేరుగా వీక్షించేలా ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేయగా భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. భక్తుల రామ నామ స్మరణలు అలాగే రాముని గీతాలను కళాకారులు ఆలపించి కోదండ రామాలయం ప్రాంగణాన్ని మరింతగా ఆధ్యాత్మిక శోభతో నింపారు . వేడుకలో ప్రత్యేకించి నీటితో నింపిన పళ్ళెం పై శ్రీ సీతారామ లక్ష్మణ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి అరిస్టు విజయ అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష అని ,అది నెరవేరింనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 2024 సంవత్సరం జనవరి 22 వ తేదీ చరిత్రలో ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయిందన్నారు.రామనామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందని అన్నారు.అలాగే దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ,కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం స్రవంతి సలహాదారు ఎం ఎస్ మూర్తి , సెక్రెటరీ జె.శ్రీనివాస్, కోశాధికారి జి వి రమణ, ఉపాధ్యక్షులు కె ఎన్ సురేష్ బాబు, వి ఎన్ హరినాధ్, మహిళా సభ్యులు అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట , ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల గురించి గొప్పగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో స్రవంతి కి చెందిన కుమార్, ప్రసాద్, రాజేంద్రన్, రవీంద్రన్, బాలాజీ, కాశీవిశ్వనాధం, మహిళా సభ్యులు శేషారత్నం, అన్నపూర్ణ, రాధిక, సరస్వతి , తెలుగు ప్రముఖులు పివి కృష్ణారావు ఇంకా పలువురు పాల్గొని రామనామ స్మరణలతో తరించారు.
..

About Author