November 25, 2024

సందడిగా సాగిన ..తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్) కార్నివాల్-2024

చెన్నైన్యూస్: ఓ వైపు నృత్యాలు, జడల సింగారం, తంబోల, చిత్రలేఖనం, శ్లోకాలు , రామాయణం క్విజ్ పోటీలు…మరోవైపు ఔత్సాహిక వ్యాపారుల స్టాల్స్,ఫుడ్ స్టాల్స్ ….ఇంకోవైపు ప్రముఖుల ప్రసంగాలు , ఉపకార వేతనాలు వితరణలు , సేవా సహాయకాల వితరణలు వెరసి తమిళనాడు ఆర్య వైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్) నిర్వహించిన కార్నివాల్-2024 వేడుకలు సందడిగా నిలిచాయి.

  చెన్నై ఆళ్వార్ పేటలోని యతిరాజ్ కళ్యాణ మండపం వేదికగా తమిళనాడు ఆర్య వైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్) ఆధ్వర్యంలో జనవరి 28 వ తేదీ ఆదివారం చేపట్టిన కార్నివాల్ వేడుకలు ప్రార్థన గీతం, జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళా సభ మద్రాసు యూనిట్ చైర్పర్సన్ అనిత రమేష్ స్వాగతోపన్యాసం చేశారు.ఈ సందర్భంగా మహిళా సభ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం  కార్యదర్శి లక్ష్మీ కర్లపాటి వార్షిక నివేదికను సమర్పించారు.ముఖ్య అతిధిగా శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల కరస్పాండెంట్  ఊటుకూరు శరత్ కుమార్ గారు వారి సతీమణి శ్యామల గారు తో హాజరై మహిళ సభ నిర్వహకులు చేపడుతున్న సేవలను కొనియాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నివాల్  వేడుకలు కోలాహలంగా జరిగాయి . ప్రత్యేకించి కార్నివాల్ బజార్, చిన్నారులు, మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు , జడల సింగారి,  రామాయణం క్విజ్, తంబోల, జులా కాంపిటిషన్, డ్రాయింగ్  తదితర పోటీలు  ఆకట్టుకున్నాయి. కార్నివాల్ లో 45 స్టాల్స్ , తొమ్మిది ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.వేడుకల్లో మద్రాసు యూత్ కోయర్ బృందాలు అందించిన సంగీత కచ్చేరి శ్రోతలను మైమరిపించింది. వేడుకల్లో భాగంగా కళాశాల విద్యార్థులు, పీజీ చదువుతున్న విద్యార్థులు  మొత్తం 75 మందికి  స్కాలర్ షిప్ లు అందించారు . వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కూడా బహుమతులు అందించారు.అలాగే సదరన్ ఇండియా వైశ్య సంఘం నిర్వహణలో కొనసాగుతున్న చరమ సంస్కార సేవా సమితి ప్రాజెక్టు కోసం  తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ తరపున రూ.20 వేల మొత్తాన్ని వితరణ చేయగా ఆ చెక్కును  ఆ ప్రాజెక్టు చైర్మన్  నేతా మునిరత్నంకు ముఖ్య అతిథి చేతులమీదుగా నిర్వాహకులు అందించారు.ఈ వేడుకలకు పెద్ద మొత్తంలో స్పాన్సర్ లుగా వ్యవహరించిన దాతలు తాటికొండ వత్సల రామచంద్ర ఫౌండేషన్ ట్రస్టీ రాజేంద్రన్, కర్జన్ అండ్ కో శేషాచలం చిమటా ఫౌండేషన్ ట్రస్టీ గౌతమ్ , వివేక్స్ సంస్థల నిర్వాహకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.ఈ కార్నివాల్ ఏర్పాట్లను మహిళ సభ చైర్ పర్సన్ అనిత రమేష్, కార్యదర్శి కర్లపాటి లక్ష్మీ , కోశాధికారి వసుంధర సుంకు లు పర్యవేక్షించారు.ఇందులో మహిళ సభకు చెందిన పద్మప్రీత సుమంత్, భార్గవిప్రసాద్ , వైజయంతిభాషికార్లు, ప్రశాంతిసతీష్, ప్రసన్న, రీనా , శ్రుతి , జయశ్రీరాజశేఖర్, మల్లికాప్రకాష్ , సునీతా అజిత్, చిత్రలేఖ , శైలశ్రీ, మనిమాలరావు,సంధ్య, శశికళఆంజనేయులు,నందిని,భార్గవి అశోక్, నందశ్రీనివాస్ తదితర సభ్యులు సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేసి అలరించారు.

About Author