September 19, 2024

ఘనంగా వై.రామకృష్ణ 81వ జయంతి వేడుకలు

చెన్నై న్యూస్:అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వ్యవస్థాపకులు యర్రమిల్లి రామకృష్ణ సాహిత్య, సామాజిక, విద్యారంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. మైలాపూర్ లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనంలో ఈ నెల 23వ తేదీ ఆదివారం రామకృష్ణ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు సభాధ్యక్షుడిగా వ్యవహరించి సభకు హాజరైన వారితో కలసి రామకృష్ణ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుగు కుటుంబాలకు అందించాలన్న సంకల్పంతో రామకృష్ణ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితిని స్థాపించి నెల నెలా వెన్నెల’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్మాణానికి ముఖ్యకారకులైన వైఎస్ శాస్త్రి కుమారుడిగా సమాజానికి రామకృష్ణ ఎనలేని సేవలందించారని కీర్తించారు. చెన్నైలో తెలుగు వారికంటూ ఉన్న ఏకైక ప్రభుత్వ భవనం అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనమేనని, దానిని ఏపీ ప్రభుత్వం, తెలుగు సంఘాలతో కలిసి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సింగపూర్ వైద్యుడు డా.పళనియప్పన్, డా.నెల్లైకుమార్ , కేఎంసీ ప్రభుత్వాసుపత్రి రేడియాలజిస్ట్ డా.దేవిమీనళ్, జనని సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, సీని యర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ ఆత్మీయ అతిధులుగా పాల్గొని రామకృష్ణ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వై.రామకృష్ణకు సంబంధించిన ‘అందమైన జీవితం’ వీడియోను ప్రదర్శించారు. అలాగే, టి.నగర్ కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థులు మయసభ, నర్తకి మునెపల్లి హంసిని నృత్య ప్రదర్శన, జోసుల శైలేష్ పద్యపఠనం, అనురాధ పుస్తక విలాపం, ఘంటసాల సావిత్రి భావగీతాలు, ప్రముఖ గాయని ఎస్పీ వసంతలక్ష్మి, సరస్వతి హాస్యగుళికలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందర్నీ అలరింపజేశాయి. డాక్టర్. తుమ్మపూడి కల్పన వ్యాఖ్యాతగా వ్యవహరించగా, పసుమర్తి జయశ్రీ, దామెర్ల పద్మావతి, గుర్రం బాలాజీలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తెలుగు తరుణి అధ్యక్షురాలు కె.రమణి, రచయిత్రి ఆముక్తమాల్యద, ఊరా శశికళ, అరుణా శ్రీనాధ్, తదితరులు ప్రముఖ మహిళలు పాల్గొన్నారు.

About Author