November 22, 2024

తెలుగు సాహిత్య పోటీలకు అనూహ్య స్పందన

చెన్నై న్యూస్: అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వార్షిక తెలుగు సాహిత్య అంతర్ పాఠశాలల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. సమితి తరపున గత 20 సంవత్సరాలుగా పైగా చిన్నారుల్లో పోటీతత్వం, తెలుగు భాషా, సాహిత్యాలపై పట్టుసాధించటం, మాతృభాషపై మమకారాన్ని పెంచటమే లక్ష్యంగా వార్షిక తెలుగు సాహిత్య పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం చెన్నై టి.నగర్ లోని ఆంధ్ర బాలానంద సంఘంలో పాఠశాల చిన్నారులకు పోటీలను ఏర్పాటు చేశారు. సమితి కార్యవర్గ సభ్యులు డి. పద్మావతి, పి.జయశ్రీ, సిహెచ్ శివసుబ్రమణ్యం, గుర్రం బాలజీ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు నగరంలోని 10కి పైగా తెలుగు పాఠశాలల నుంచి దాదాపు 215 మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు పద్యాలు, వ్యాసరచన, దేశభక్తిగీతాలు, బాల గేయాలు, చిత్రలేఖనం, క్విజ్ వంటి పలు రకాల పోటీలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమదైన ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కాసల రమణి ,భువనేశ్వరి దేవి, సి .బానుమతి, అరుణా శ్రీనాథ్, వసుంధర దేవి, లలితాకమలాకర్, తిరుమల ఆముక్త మాల్యాథ, శైలజా, ఇంద్రగంటి పార్వతీ దేవి,గజగౌ రి, ఎస్పీ వసంతలక్ష్మిలు వ్యవహరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోటీల్లో విద్యార్థులతోపాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. న్యాయనిర్ణేతలుగా పాల్గొన్న వారిని సమితి తరపున ఘనంగా సత్కరించుకోగా, పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు త్వరలో బహుమతులను ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు

About Author