January 22, 2025

పుళల్ కావాంగరై తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

చెన్నై న్యూస్ : పుళల్ కావాంగరై తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పుళల్ ప్రాంతంలో వెలసియున్న సుమారు 1,200 ఏళ్లనాటి పురాతన స్వర్ణాంబిక సమేత తిరుమూలనాధర్ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 వతేది మంగళవారం ఉదయం 7.30 గంటలకు స్వామివారికి పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకం నేత్రపర్వంగా నిలిచింది.

అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మహా దీపారాధన చేసి భక్తులకు స్వామివారి ఆశీస్సులను అందించారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేశారు. పంచాంగ పఠనం అనంతరం ఉగాది విశిష్టతను వేదపండితులు భక్తులకు వివరించారు. పుళల్ కావాంగరై ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి పుళల్ కావాంగరై మహిళలు 150 కేజీల పువ్వులతో స్వర్ణాంబిక సమేత తిరుమూలనాధర్ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య సి ఎం కె రెడ్డి ,
విశిష్ట అతిధులుగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లయన్ తాళ్లూరి సురేష్, తమిళనాడు కమ్మ నాయుడు సంఘ అధ్యక్షుడు లయన్ ఏ జి జయకుమార్, లయన్ డాక్టర్ ఏ వి శివకుమారి, ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. నాగభూషణం, సాయి చాక్లెట్ వరల్డ్ సీఈఓ గుండా గోపాలకృష్ణ , 23వ వార్డు కౌన్సిలర్ రాజన్ బర్నబాస్ ,లయన్ జె .రవి , ఎం.వి.పొన్నియం శేఖరన్, సెల్వి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను ఘనంగా సత్కరించారు. 1000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు.ఉగాది వేడుకలను చక్కగా నిర్వహించటం పై పుళల్ కావాంగరై తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని వేడుకలకు విచ్చేసిన అతిధులు, తెలుగువారు అభినందించారు.

About Author