December 23, 2024

ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత తెలుగు శిక్షణా తరగతులు ప్రారంభం

చెన్నై న్యూస్ :ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూ టి ఎఫ్) ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు నిర్వహించనున్న ఉచిత తెలుగు శిక్షణా తరగతులు శనివారం ఘనంగా ప్రారంభమ య్యాయి. చెన్నై టీ. నగర్ లోని డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ శిబిరంలో కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన్ రావు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డబ్ల్యూ టి ఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ వి ఎల్ ఇందిరా దత్ ఉచిత తెలుగు శిక్షణా శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె పంపించిన అభినందన సందేశాన్ని శ్రీలక్ష్మీ మోహన్ రావు సభకు చదివి వినిపించారు.2006 సంవత్సరం నుంచి డబ్ల్యూ టి ఎఫ్ నిర్వహిస్తున్న ఉచిత తెలుగు తరగతులు ద్వారా ఇప్పటి వరకు సుమారు 5 వేల మందికి పైగా ఇతర భాషల వారు తెలుగు నేర్చుకుని లబ్ది పొందారని గుర్తుచేశారు. ,ఈ ఏడాది 4 నెలల పాటు తెలుగు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తనవంతు కృషి చేస్తానని ఇందిరా దత్ హామీ ఇచ్చారని తెలిపారు.
ముఖ్యంగా మాతృ భాషను ప్రతీ తెలుగు కుటుంబంలోని సభ్యులందరూ పట్టుదలగా నేర్చుకుని భాషా పరిరక్షణకు ముందుకు రావాలని శ్రీలక్ష్మిమోహన్ రావు పిలుపునిచ్చారు.తొలిరోజు శిక్షణ తరగతులకు 60 మంది విచ్చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు.

   కాగా నాలుగు నెలల పాటు సాగనున్న ఈ శిక్షణ తరగతులు  ప్రతీ శనివారం మధ్యాహ్నం  3 గంటల  నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పోకెన్ తెలుగు ,  అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు చదవడం, రాయటం పై తెలుగు పండిట్ మోహన్ , డబ్ల్యూ టి ఎఫ్ సభ్యులు మాణిక్యం , తెలుగు శిక్షణ తరగతుల కో -ఆర్థినేటర్ డాక్టర్  ఏ .వి  .శివ కుమారి లు నేర్పుతారు .ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో డబ్ల్యూ టి ఎఫ్  పూర్వ సెక్రెటరీ జనరల్ ఎం.ఆది శేషయ్య , డి ఎల్ ఎన్ రెడ్డి , కోశాధికారి వెంకట్ మాదాల , సంయుక్త కోశాధికారి రుక్మిణీ దేవి ,సభ్యులు లలితా సుధాకర్, సురేఖ మోహన్ దాస్ , నిర్మలా దేవి , మీడియా ఇన్ ఛార్జి  గోటేటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

About Author