December 22, 2024

రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచిన ఎస్ కె పి డి విద్యార్థి పి. త్రినాధ్ కు ఘన సత్కారం

చెన్నై న్యూస్ : చెన్నై జార్జిటౌన్ గోవిందప్ప నాయకన్ వీధిలో ఉన్న ఎస్ కె పీడీ బాలుర మహోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, బాషా సాహిత్య సాంస్కృతిక సంఘ ముగింపు వేడుకలు ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాద్యాయురాలు ఓరుగంటి లీలారాణి ఆధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా త్యాగరాయ కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ ఎం.మునిరత్నం పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని అసక్తికరంగా విద్యార్థులకు వివరించిన మునిరత్నం తెలుగు విద్యార్థులకు దశాబ్దాలుగా విద్యాదానం చేస్తున్న ఎస్ కె పి డి యాజమాన్యం సేవలు అభినందనీయం అని ప్రసంశించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్ కె పి డి బాలుర మహోన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థి పి.త్రినాథ్ ఇటీవల రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనాక్ న్యూ ఇన్వెన్షన్స్ ఐడియాస్ ఎగ్జిబిషన్ పోటీలో విజేతగా నిలిచి ఇన్స్పైర్ మనాక్ అవార్డు (inspire manak award) గెలుచుకున్నందున అతనితో పాటు గణిత ఉపాధ్యాయులు గురుమూర్తిలను శాలువతో ఘనంగా సత్కరించారు. త్వరలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో త్రినాధ్ పాల్గొంటుండటం విశేషం.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎస్ ఎల్ సుదర్శనం పాల్గొని ప్రత్యేకంగా విద్యార్థి పి.త్రినాధ్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓరుగంటి లీలారాణి మాట్లాడుతూ త్రినాధ్ సాధించిన విజయం తమ పాఠశాలకే గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author