January 22, 2025

లోక కళ్యాణార్ధం …అక్షయ సాయిబాబా ఆలయంలో వైభవంగా మహా సుదర్శన హోమం

చెన్నై న్యూస్ :జై వాసవీ సాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం అక్షయ సాయిబాబా ఆలయంలో మహా సుదర్శన హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
చెన్నై ఆచారప్పన్‌ వీధిలో వెలసియున్న అక్షయ సాయిబాబా ఆలయంలో మంగళవారం , బుధవారం రెండు రోజులు పాటు అష్టోత్తర శతకలశ మహాభిషేకం మహోత్సవం చేపట్టారు. జులై 2వ తేదీ మంగళవారం గణపతి పూజ, సంకల్పం, పుణ్యాహవచనం, కలశ స్థపణం, అగ్ని ప్రతిష్ఠ, లలితా అష్టోత్తర అర్చన, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు . జులై 3వ తేదీ బుధవారం లోక కల్యాణార్థం బుధవారం ఉదయం 7 గంటలకు పుణ్యాహవచనం సంకల్పం, కుంభ ఆరాధన, మహా సుదర్శన హోమ మహా పూర్ణాహుతి, మహా అభిషేకం, మహా హారతి వంటి పూజలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు . అనంతరం జై వాసవీ సాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అజంతా డాక్టర్‌ కనిగెలుపుల శంకర రావు –విజయలక్ష్మీ, ఫైనాన్సియల్‌ ట్రస్టీ డాక్టర్‌ ఎం.వీ. నారాయణ గుప్తా –జ్యోతి దంపతుల పర్యవేక్షణలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల లోపు 108 కలశాల మహా అబిషేక పూజలను లోక క్షేమం కోసం వైభవంగా నిర్వహించారు . మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాయినాధునికి అభిషేకాలు చేసి తరించారు.
ఈ సందర్భంగా శ్వేత వర్ణ సాయినాథుని విగ్రహాన్ని , ఆలయ ప్రాంగణాన్ని పూలు ,అరటి మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులను కనువిందు చేశారు. భక్తులు పాల్గొని సాయి బాబా కీర్తిస్తూ భక్తి పాటలను అలపించి అక్షయ బాబా కృపకు
పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.

..

About Author