December 26, 2024

సంగీతానికి మంగళంపల్లి బాలమురళి కృష్ణ సేవలు అజరామరం – సేవా రత్న దేవరకొండ రాజు

చెన్నై న్యూస్:కర్ణాటక సంగీతానికి డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ చేసిన సేవలు అజరామరమని తమిళనాడు తెలుగు పీపుల్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజు కొనియాడారు.శ్రీ కళారంజని చారిటబుల్‌ ట్రస్ట్‌ , శ్రీ కళా రంజని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ సంయుక్త ఆధ్వర్వంలో కర్ణాటక సంగీత విద్వాంసులు దివంగత మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 95వ జయంతిని పురస్కరించుకుని మురళి గాన ప్రవాహం పేరిట ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.చెన్నై టి.నగర్‌లోని సర్‌ పిట్టి త్యాగరాజ హాలు వేదికగా శ్రీ కళారంజని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జే .శ్రీనిబాబు నేతృత్వంలో జులై 7 వతేది ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిరవదికంగా సంగీత గాన, నృత్య, వాయిద్య ప్రదర్శనలు జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ నేపధ్య గాయని, గానకోకిల పద్మవిభూషణ్‌ పి సుశీల పాల్గొని మురళి గాన ప్రవాహం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. విశిష్ట అతిధుగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త శోభా రాజా చేతుల మీదుగా ఫండ్ రైజ్ ఈవెంట్ గా శ్రీ విద్యారంబ జ్ఞాన మహా సరస్వతి టెంపుల్ తరపున నిర్వహించనున్న సరస్వతి నమోస్తుతే ఆడియో ను రిలీజ్ చేశారు. అనంతరం బాల మురళి కృష్ణ జయంతి సందర్భంగా డాక్టర్‌ వి బి సాయి కృష్ణ యాచేంద్ర చే సంగీత గేయధార కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.ఇంకా ఈ వేడుకల్లో అతిధులుగా తమిళనాడు తెలుగు పీపుల్‌ సొసైటీ వ్యవస్థాడుక అధ్యక్షులు దేవరకొండ రాజు , సంగీత దర్శకులు సాలూరి వాసూరావు, మాజీ చీఫ్ ఎలక్షన్‌ కమీషనర్‌ టిఎస్‌ కృష్ణమూర్తి, హేమంత కుమార్, ఆడిటర్ బాల సుబ్రహ్మణ్యన్ ,మాధురి, ఆదిత్య శర్మలు పాల్గొని బాలమురళికృష్ణ కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సేవారత్న దే
వరకొండరాజు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో రారాజుగా ఎదిగిన సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళి కృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . యువ సంగీతకారులు బాలమురళి కృష్ణను సూర్తిగా తీసుకుని సంగీతంలో మేటిగా రాణించాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో బాల మురళి కృష్ణ పేరుతో మరిన్ని సంగీత కార్యక్రమాలను చేపట్టేందుకు తమవంతు ప్రోత్సాహం అందిస్తానని హామిఇచ్చారు . నిర్వాహకులు శ్రీనిబాబు సారథ్యంలో ఏకంగా 12 గంటలపాటు సంగీత ధ్వనులతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి బాలమురళి కృష్ణకు సంగీతనీరాజనాలు అందించటం అభినందనీయం అని కొనియాడారు .
బాలమురళి కృష్ణ అందించిన సంగీత పాటలతో 12 గంటల పాటు సంగీత గాన, నృత్య , వాయిద్యాలతో మంగళం పల్లికి సంగీత నీరాజనాలు అర్పించారు . తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి , పలువురు విదేశాల నుంచి సైతం విచ్చేసి ప్రదర్శనలు ఇచ్చారు .సంగీతంతో , నృత్యాలతో ప్రముఖ కళాకారుల నుంచి చిన్నారుల వరకు తమదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చి అలరించారు. ముందుగా స్వాగతోపన్యాసం ను స్కూల్ సెక్రటరీ సేవా రత్న రాజలక్ష్మి చేయగా, వ్యాఖ్యాతగా మెహర్ బాలగోపాల వ్యవహరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనిబాబు అతిథులను , కళాకారులను ఘనంగా సత్కరించారు.

About Author